70 ఏళ్ళ కెరీర్‌లో అక్కినేనిని ఇబ్బంది పెట్టిన పాత్ర.. ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది!
on Oct 5, 2024
సినిమా ఇండస్ట్రీలో హీరోలు.. సక్సెస్‌లు, సూపర్‌హిట్లు సాధించడం వెనుక ఎంతో కృషి ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. ఏ హీరో అయినా తను ఎంపిక చేసుకునే సినిమాలను బట్టే విజయాలు సాధిస్తుంటారు. చాలా సందర్భాల్లో కొంతమంది హీరోలకు సినిమా మొదలైన తర్వాత అది సక్సెస్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా అనేది అర్థమైపోతుంది. అలా సినిమాని ముందే జడ్జ్ చేయగల హీరోలు కొందరున్నారు. వారిలో అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ పేర్లను ప్రముఖంగా చెప్పుకోవచ్చు. షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఆ సినిమా ఆడదని బాహాటంగానే దర్శకనిర్మాతలకు చెప్పేసేవారు కృష్ణ. ఆయన చెప్పినట్టుగానే ఆ సినిమా ఫ్లాప్ అయ్యేది. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న హీరోలు కావచ్చు, పాత తరం హీరోలు కావచ్చు. వారి కెరీర్‌లో మధ్యలోనే ఆగిపోయిన సినిమాలు చాలా ఉంటాయి. అయితే అక్కినేని నాగేశ్వరరావు కెరీర్ ఎంతో భిన్నమైనది. దాదాపు 70 సంవత్సరాలకు పైగా నటుడిగా కొనసాగి 255కి పైగా సినిమాల్లో నటించారు అక్కినేని. ఆయన కెరీర్‌లో షూటింగ్ ప్రారంభమై మధ్యలోనే ఆగిపోయిన సినిమా ఒక్కటి మాత్రమే ఉందంటే ఆశ్చర్యం కలగకమానదు.
70 సంవత్సరాల కెరీర్‌లో ఒక్క సినిమా మాత్రమే మధ్యలో ఆగిపోయింది అంటే సినిమాల ఎంపిక విషయంలో అక్కినేని ఎన్ని జాగ్రత్తలు తీసుకునేవారో అర్థమవుతుంది. అలా మధ్యలోనే ఆగిపోయిన సినిమా పేరు ‘సదారమ’. ఏవీయం సంస్థ నిర్మాణంలో ఈ సినిమా ప్రారంభమైంది. మూడు రోజులు షూటింగ్ జరిగింది. అయితే అక్కినేని నాగేశ్వరరావు మాత్రం ఆ సినిమా ఒప్పుకున్నందుకు, అందులోని క్యారెక్టర్ చేస్తున్నందుకు ఎంతో బాధ పడ్డారు. అందుకు కారణం అది ఒక దొంగ వేషం. మొదట ఈ కథ చెప్పినపుడు బాగానే అనిపించినా.. దొంగ వేషం మాత్రం అక్కినేనిని ఇబ్బంది పెట్టింది. షూటింగ్ జరిగిన మూడు రోజులు ఆ క్యారెక్టర్ గురించే ఆలోచించేవారాయన. ఎందుకంటే సినిమాలో హీరో దొంగ అయినా.. అలా మారడానికి కారణాలు ఏమిటి, ఆ తర్వాత దొంగ మంచివాడిగా మారి మంచి పనులు చేయడం వంటివి ప్రేక్షకులు ఆశిస్తారు. కానీ, ఈ సినిమా చివరి వరకు హీరోది నెగెటివ్ క్యారెక్టరే. ఎంతో ఆలోచించిన తర్వాత అక్కినేని ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చారు.
నాలుగో రోజు అక్కినేని షూటింగ్‌కి వెళ్ళలేదు. ఏవీయం ఆఫీస్‌కి వెళ్ళి ‘సార్.. సదారమ సినిమా చెయ్యలేను. ఎందుకంటే అందులోని పాత్ర నన్ను చాలా ఇబ్బంది పెడుతోంది. నన్ను అలాంటి క్యారెక్టర్‌లో ప్రేక్షకులు చూడలేరు. సినిమా ప్రారంభంలోనే ఉన్నాం కాబట్టి వేరెవరితోనైనా చెయ్యండి. ఇప్పటివరకు ఎంత ఖర్చయిందో అంతా నేను ఇస్తాను. ఈ సినిమా చేయడం నావల్ల మాత్రం కాదు’ అని నిర్మాత ఎ.వి.మెయ్యప్పన్‌తో చెప్పారు అక్కినేని. కానీ, ఆయన దానికి అంగీకరించలేదు. ‘ఎలా కుదురుతుంది. పోస్టర్లు కూడా వేసేశాం. డిస్ట్రిబ్యూటర్లు ఈ కథను ఒప్పుకున్న తర్వాతే స్టార్ట్ చేశాం. వాళ్ళ దగ్గర మాకు మాట వస్తుంది’ అన్నారు. ఎంత సర్ది చెప్పుకుందామన్నా అక్కినేని మనసు దానికి అంగీకరించడం లేదు. అప్పుడు నిర్మాత చక్రపాణి దగ్గరకు వెళ్ళి విషయం చెప్పారు. ‘నేను ఈ సినిమా ఎంపికలోనే తప్పు చేశాను. పాత్ర నచ్చకుండా ఎలా చెయ్యమంటారు? మీరే ఏదో ఒకటి చెయ్యాలి’ అన్నారు అక్కినేని.
అంతా విన్న చక్రపాణి వెంటనే ఎ.వి.మెయ్యప్పన్‌కి ఫోన్ చేశారు. ‘సదారమ సినిమా అక్కినేని చెయ్యడండీ. వాడికి పట్టుదల ఎక్కువ. ఎవరు చెప్పినా వినడు’ అంటూ ఆయనకి సర్దిచెప్పారు చక్రపాణి. దీంతో ఏవీయం సంస్థ ఆ సినిమాను ఆపేసింది. ఆ సినిమా కోసం అయిన ఖర్చును అక్కినేని చెల్లిస్తానని చెప్పారు. కానీ, మెయ్యప్పన్ మాత్రం తీసుకోలేదు. ఆ సినిమా కోసం పారితోషికంగా ఇచ్చిన డబ్బును కూడా తిరిగి ఇచ్చే ప్రయత్నం చేశారు అక్కినేని. దాన్ని కూడా వద్దని చెబుతూ ‘మనం మరో సినిమా చేద్దాం. దానికి అడ్వాన్స్‌గా ఉంచండి’ అని చెప్పారు. ‘సదారమ’ సినిమాకి బదులుగా ఏవీయం కోసం ‘భూకైలాస్’ చేశారు అక్కినేని. ఈ సినిమాలో ఆయన నారదుడిగా నటించారు. ఆ సినిమా ఘనవిజయం సాధించింది. సినిమాలోని పాటలు కూడా చాలా పెద్ద హిట్ అయ్యాయి. నటుడిగా అక్కినేనికి మంచి పేరు తెచ్చింది ‘భూకైలాస్’.
Also Read